Chiranjeevi | ప్రత్యేకత సమాహారంగా రూపొందుతోన్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’. జగదేకవీరుడు-అతిలోకసుందరి, అంజి చిత్రాల తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియోఫాంటసీ సినిమా ఇదే కావడం విశేషం. త్రిష ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్లో జరుగుతున్నది. ఇటీవలే చిరంజీవి జపాన్ వెళ్లారు. అక్కడ పదిరోజుల పాటు జరిగే ‘విశ్వంభర’ షెడ్యూల్లో పాల్గొని, ఈ నెలాఖరు లోగా ఆయన ఇండియా తిరిగొస్తారని ఇన్సైడ్ టాక్.
ఇక ‘విశ్వంభర’ విషయానికొస్తే.. ఫాంటసీ సినిమాల్లో ఇదో కొత్త ప్రయత్నం. సృష్టి నాశనానికి తెగబడే దుష్టశక్తుల్ని పరిమార్చడానికి పుట్టిన కారణజన్ముడిగా ఇందులో చిరంజీవి కనిపిస్తారు. భూమిని ‘విశ్వంభర’ అంటారు. అలాగే ఆదిపరాశక్తికీ విశ్వంభర అనే పేరుంది. అయితే ఈ కథలో ‘విశంభర’ అనేది ఓ లోకం పేరు అని సమాచారం. ఆ విశ్వంభర లోకంలో ఏం జరిగింది? చిరంజీవి పాత్రకూ, ఆ లోకానికీ ఉన్న సంబంధం ఏంటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. మీనాక్షి చౌదరి, అషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ విలన్గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మేలో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: ఎం.ఎం.కీరవాణి.