Ram Charan | మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ‘పెద్ది’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకుని టాప్ ట్రెండింగ్‌లో ఉన్న రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించారు.
దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సుమతీ శతక పద్యంతో తన పోస్ట్‌ను ప్రారంభించారు. ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’. అని రాస్తూ కొడుకు పుట్టగానే తండ్రికి నిజమైన సంతోషం కలగదని, సమాజంలో ఆ కొడుకు గొప్పతనాన్ని చూసి జనాలు మెచ్చుకున్నప్పుడే ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని వివరించారు.
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చిరంజీవి తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమని పేర్కొన్నారు. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని… pic.twitter.com/sbddqa3m61
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 24, 2026