సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అగ్ర నటుడు కమల్‌హాసన్ నిర్మాత కావడంతో ఈ సినిమాపై దక్షిణాదిన భారీ హైప్ క్రియేట్ అయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి పనిచేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకుడిని ఖరారు చేసే విషయంలో ఆది నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొలుత సీనియర్ దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారని ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత లోకేష్ కనకరాజ్, శిబి చక్రవర్తి పేర్లు వినిపించాయి. వారు కూడా ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు నెల్సన్ దిలీప్‌కుమార్‌ను ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడిగా ఖరారు చేశారు. ఇప్పటికే రజనీకాంత్‌కు ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించారు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం ఆయన ‘జైలర్-2’ చిత్రీకరణలో ఉన్నారు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్, వినోదం ప్రధానంగా సాగే ఈ కథకు నెల్సన్ మాత్రమే న్యాయం చేయగలడని కమల్‌హాసన్ భావించారని, అందుకే ఆయన్ని దర్శకుడిగా ఎంపిక చేశారని అంటున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.