Mega Family | ప్రస్తుతం మెగా హీరోలకి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. కొద్ది రోజల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అంచనాలకు విరుద్ధంగా, తొలి రోజే ఈ చిత్రం టైర్-1 హీరోల రేంజ్ ఓపెనింగ్స్ కన్నా తక్కువ వసూళ్లు నమోదు చేసింది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ మూవీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.64.74 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా రూ.44.7 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు సమాచారం.
హరిహర వీరమల్లు చిత్రానికి మొత్తంగా రూ.128 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందులో 33 శాతం మొదటి రోజు రాబట్టగలిగాడు పవన్ కళ్యాణ్. అయితే సెకండాఫ్‌కి తీవ్రమైన నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఆ ప్రభావం తీవ్రంగా పడింది అని చెప్పాలి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు ఈ మూవీకి 30 శాతం కూడా టికెట్లు అమ్ముడు కాలేదు. మరోవైపు అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా ‘హరిహర వీరమల్లు’ మూవీ వసూళ్లపై ప్రభావం చూపించాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ మూవీ రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ నష్టాలు చవిచూసిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల వచ్చిన ఓజీ చిత్రం సేఫ్ జోన్లో పడ్డా కూడా, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించలేకపోయిందని సమాచారం. ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాని ఎంజాయ్ చేశారని అంటున్నారు.
‘హరిహర వీరమల్లు’తో పాటు, ఇటీవల మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం‘భోళా శంకర్’ భారీ ఫెయిల్యూర్ (రూ.50 కోట్ల గ్రాస్ కూడా సాధించలేకపోయింది). ఇక రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, కనీసం రూ.100 కోట్ల షేర్ కూడా రాబట్టలేక ఎపిక్ డిజాస్టర్ అయింది. ఇక వరుణ్ తేజ్ వరుసగా గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ చిత్రాలతో వరుస డిజాస్టర్స్ చవి చూశాడు. పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’తో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో మెగా హీరోల సినిమాల వల్ల నిర్మాతలు రూ.300 కోట్లు నుంచి రూ.400 కోట్లు వరకు నష్టపోయినట్టు చెబుతున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై ఇప్పటికే నెగిటివ్ ప్రచారం ప్రారంభమైంది. టీజర్ ట్రోలింగ్‌కు గురయ్యింది. దీంతో గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ చిరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారుపైనే ఉంది. అనీల్ రావిపూడి దర్శకత్వం, చిరు స్టైలిష్ లుక్స్ మూవీపై అంచనాలు పెంచాయి.