Mega 157 | మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. ఒక సినిమా అయిన వెంటనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇటీవల మొదలైన అనిల్ రావిపూడి సినిమా మాత్రం పరుగులు పెడుతోంది. ఇక ఈసినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తూనే ఉంది.. చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారనే వార్త కూడా వైరల్ అయింది. రెండు పాత్రలలో ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా ఉంటుందని, మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంటుందనే టాక్ అయితే నడిచింది. దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ముస్సోరిలోని సుందరమైన ప్రదేశాలలో రెండవ షెడ్యూల్ జరుగుతోంది. ప్రస్తుతంలో ముస్సోరిలో చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట అనీల్ రావిపూడి. తాజాగా సెట్లో నయనతార అడుగుపెట్టింది. అక్కడ హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. అలానే ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారట.
మెగా 157 చిత్రంలో చిరంజీవి పేరు శివ శంకర్ వర ప్రసాద్‌గా ప్లాన్ చేశారు దర్శకుడు అనిల్. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్‌తో మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి అదే కిక్‌తో చిరు కోసం కథ రెడీ చేశారు. ఈ సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలని కసితో పని చేస్తున్నాడు. కాగా, చిరంజీవి గత సినిమాలన్నీ యాక్షన్ డ్రామాలు కాగా, ఈసారి ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా157 సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, అద్భుతమైన బాణీలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.