Mega 157 | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్బంగా అభిమానులకు ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ట్రిపుల్ ధమాకా అందించే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్పెషల్ రోజుకు ముందు నుంచే సందడి మొదలైంది. మరి కొద్ది నిమిషాలలో చిరు క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్నసినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. అయితే రేపు (ఆగస్టు 22 ,శుక్రవారం) చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిత్ర బృందం ఓ అప్డేట్ను ఇచ్చింది.
చిరంజీవి పుట్టిన రోజు కానుకగా మెగా 157 టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉదయం 11.25 గంటలకు టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మెగా 157 మూవీకి ‘మన శంకర వరప్రసాద్ గారు’అనే టైటిల్‌ను ఖరారు చేశారు చేసినట్టు తెలుస్తుంది. ఈ టైటిల్‌ను మాస్‌కి మరింత దగ్గరగా తీసుకెళ్లే విధంగా, విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ద్వారా రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ట్రిపుల్ ధమాకాలో భాగంగా మూడో సర్ప్రైజ్ మెగాస్టార్ చిరంజీవి, ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో మరో సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. బర్త్‌డే రోజునే ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అలాగే కేథరిన్ త్రెసా, వీటీవీ గణేష్,మురళీధర్ గౌడ్ వంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి చిరు బర్త్ డే సందర్భంగా వస్తున్న అప్డేట్స్తో ఫ్యాన్స్ ఆనందం పీక్స్‌కి వెళ్లింది.