హీరో నాని సోదరి దీప్తి దర్శకురాలిగా మారి రూపొందించిన ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ ఈ నెల 25న స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఐదు విభిన్న కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్లో వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, సునైన, సత్యరాజ్, ఆదా శర్మ, రోహిణి, ఆకాంక్షా సింగ్, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రీ స్ట్రీమింగ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ…‘ఈ ఆంథాలజీ సిరీస్ను మీరంతా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. ఇందులోని ఐదు కథల్లో జీవిత పాఠాలు ఉన్నాయి. అందరూ తమ జీవితాన్ని ఇందులో పోల్చుకుంటారు. కొన్ని ఆశ్చర్యపరిచే మలుపులు కూడా కథలో ఉంటాయి. అక్క దీప్తిని చూస్తుంటే గర్వంగా ఉంది.’ అని అన్నారు. దర్శకురాలు దీప్తి మాట్లాడుతూ…‘నాని లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. నా తమ్ముడి వల్లే దర్శకురాలిని అయ్యాను.’ అని చెప్పింది.