Meena | దశాబ్దాల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి మీనా గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలోని తన విలాసవంతమైన ఇంటిని భారీ ధరకు అమ్మేశారన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా తమిళ, తెలుగు వర్గాల్లో మీనా తన చెన్నై బంగ్లాను సుమారు రూ.100 కోట్లకు ఒక విదేశీ జంటకు విక్రయించారని వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. సైదాపేట శ్రీరామ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఈ ఇల్లు కేరళ సంప్రదాయ శైలిలో, అరుదైన కలపతో రాజభవనాన్ని తలపించేలా రూపొందించబడింది. అప్పట్లోనే ఈ ఇంటి నిర్మాణానికి సుమారు రూ.10 కోట్లు ఖర్చయిందని సమాచారం. ప్రస్తుతం ఆస్తి విలువ పెరగడంతో మీనా ఈ డీల్‌కు ఒప్పుకుని విదేశాలకు వెళ్లబోతున్నారన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
అయితే ఈ వార్తలపై మీనా సన్నిహితులు స్పందించి స్పష్టత ఇచ్చారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వారు తేల్చి చెప్పారు. ఆ ఇల్లు మీనాకు కేవలం ఒక ఆస్తి కాదు, అది ఆమె భావోద్వేగాలతో ముడిపడి ఉన్న స్థలం అని పేర్కొన్నారు. ఆమె భర్త అక్కడే తుదిశ్వాస విడిచారని, కుమార్తె అదే ఇంట్లో పుట్టి పెరిగిందని గుర్తుచేశారు. అలాంటి సెంటిమెంట్ ఉన్న ఇంటిని అమ్మే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. తెలుగులో మీనా ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె చంటి సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. వెంకటేష్‌తో ఆమె జోడీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. “సుందరకాండ”, “అబ్బాయిగారు”, “సూర్యవంశం” వంటి చిత్రాలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
అలాగే చిరంజీవి తో “ముఠా మేస్త్రి”, బాలకృష్ణతో “బొబ్బిలి సింహం”, నాగార్జునతో “అల్లరి అల్లుడు” వంటి చిత్రాలతో అగ్ర హీరోలందరి సరసన నటించి తన స్థాయిని చాటుకున్నారు. “సీతారామయ్య గారి మనవరాలు”, “రాజేశ్వరి కళ్యాణం” వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న మీనా, దృశ్యం సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ప్రతిభను నిరూపించారు. ఇందులో వెంకటేష్ భార్యగా చేసిన “జ్యోతి” పాత్రకు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో మలయాళంలో కూడా ఈ కథలో కీలక పాత్ర పోషించడం విశేషం.