నితిన్, నభానటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్ సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. మేర్లపాకగాంధీ దర్శకుడు. తమన్నా కీలక పాత్రధారి. సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే వారం నుంచి మ్యూజిక్ ఫెస్ట్‌ను ఆరంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అంధుడిగా నటిస్తూ బతికే ఓ పియానో ప్లేయర్ నిజంగానే కంటిచూపును కోల్పోయే పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఆ విపత్కర పరిణామాల నుంచి అతడు ఎలా బయటడ్డాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి’ అని తెలిపారు. జిషుసేన్‌గుప్తా, శ్రీముఖి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: జె యువరాజ్.
‘మాస్ట్రో’కోసం సొంత గళం
‘మాస్ట్రో’ సినిమాలో తమన్నా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నది. తాజాగా తన పాత్ర కోసం ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పింది. తాను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది ఈ సుందరి. ‘మాస్ట్రో డబ్బింగ్ టైమ్’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది తమన్నా.