Master Mahendran | తెలుగు సినీ చరిత్రలో ‘పెద్దరాయుడు’ ఒక క్లాసిక్. ఆ సినిమాలో “నేను చూశాను తాతయ్య” అనే డైలాగ్‌తో కథను మలుపు తిప్పిన ఆ చిన్నారిని ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రలో ఒదిగిపోయిన మాస్టర్ మహేంద్రన్, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘నీలకంఠ’. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వందలాది సినిమాల్లో నటించిన మహేంద్రన్, ఇటీవల కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో యంగ్ విజయ్ సేతుపతి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఆ సినిమాలో ఆయన చూపించిన పరిపక్వతకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే జోష్‌తో ‘నీలకంఠ’ సినిమాతో హీరోగా మన ముందుకు వస్తున్నాడు.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. ఒకప్పటి క్రేజీ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కొత్త ఏడాది కానుకగా జనవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్ చూస్తుంటే మహేంద్రన్ ఈ సినిమాతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమాకు శ్రవణ్ అందించిన డీవోపీ రిచ్ లుక్‌ను తీసుకురాగా.. ప్రశాంత్ బిజె అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ గ్లోబల్ సినిమాస్ దక్కించుకోవడం విశేషం. నైజాం ఏరియాలో ఈ సంస్థ ద్వారా సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.