Mastan Sai | నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య, లావణ్య వర్సెస్ మాల్వీ మల్హోత్ర మధ్య ఎన్నో ట్విస్టులు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ విషయంపై రాజ్ తరుణ్ వచ్చి మీడియా వేదికగా తన తప్పేమి లేదంటూ ప్రకటించాడు. లావణ్య, మస్తాన్ సాయి ఇలా కలిసి చేస్తున్నారు. మస్తాన్ సాయికి లావణ్యకు రిలేషన్ ఉంది. డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారు అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై లావణ్య కూడా అప్పట్లో రాజ్‌తరుణ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అమ్మాయిలు ప్రయివేట్‌గా ఉన్న సమయంలో వారి వీడియోలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు మస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే లావణ్య అతడిపై ఫిర్యాదు చేయడంతో పాటు అతడు రికార్డు చేసిన వీడియోలను పోలీసులకు అందజేసినట్లు తెలుస్తుంది. ఇక లావణ్య అందించిన హార్డ్ డిస్క్‌లో దాదాపు 200లకు పైగా ప్రయివేట్ వీడియోలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మస్తాన్ సాయిని ఇంతకుముందే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.