Maruthi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఫాంటసీ హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ, విడుదల తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా, తర్వాత కలెక్షన్లు మరింత తగ్గి చివరికి డిజాస్టర్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మారుతిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద స్టార్ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించలేదంటూ ట్రోలింగ్ చేశారు. ఈ విమర్శలతో కొంతకాలం పాటు మారుతి సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే కాకుండా, బయట కూడా పెద్దగా కనిపించలేదు.
అయితే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న మారుతి ఈ నెగిటివిటీపై స్పందించారు. “మన చుట్టూ ప్రతిరోజూ నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ వ్యక్తులు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పాజిటివ్‌గా ఆలోచించడం, సమాజాన్ని మంచి దిశగా చూడటం చాలా కష్టం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ‘ది రాజాసాబ్’తో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి చేరుతారని భావించిన మారుతికి ఈ సినిమా ఫలితం పెద్ద దెబ్బే కొట్టింది. చిన్న, మధ్యస్థాయి హీరోలతో విజయాలు సాధించిన ఆయనకు ప్రభాస్‌తో పని చేసే అవకాశం ఒక పెద్ద బ్రేక్‌గా భావించారు. కానీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విమర్శలు పెరిగాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా మారుతి ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేశారు. “ప్రతి ప్రయాణం ఒక పాఠం” అంటూ ప్రారంభించిన ఆయన, తన తదుపరి సినిమా స్క్రిప్ట్‌పై పని చేస్తున్నట్లు వెల్లడించారు. దేవుడి ఆశీస్సులతో స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. మారుతి షేర్ చేసిన ఫోటోలో కొత్త సినిమా స్క్రిప్ట్‌ను దేవుడి ముందు ఉంచి పూజ చేసినట్టు కనిపించడం విశేషం. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.