OTT | వేసవి కాలం వచ్చిందంటే థియేటర్లలో సినిమా సందడి ఓ రేంజ్లో ఉంటుంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.కానీ, ఈ ఎండకాలంలో టాకీసులకు వడదెబ్బ తగిలినట్టయింది. ముందుగా అనుకున్నసినిమాలకు ఎన్నికల కారణంగా వాయిదా తప్పలేదు. అయితే, థియేటర్లు బోసిపోయినా ప్రేక్షకులకు మాత్రం ఈ వేసవి కావాల్సినంత వినోదాన్నిచ్చింది. ఓటీటీలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి. మొత్తంగా ఈ సమ్మర్లో అటు టాకీసుల్లో.. ఇటు ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాల సంగతులు చూద్దాం.
కల్కి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమాపై అందరికీ చాలా ఆశలు ఉన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచీ ఈ చిత్రంపై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. ‘కల్కి..’ పోస్టర్లు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదాపడింది. అయితే, ఈ సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదాపడింది. తాజాగా ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటాడు విశ్వక్సేన్. కొత్త తరహా పాత్రలతో తనలోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరిస్తుంటాడు. టీజర్‌ను బట్టి ఈ సినిమాలో మరో డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలరించడానికి సిద్ధమయ్యాడు. మొత్తంగా వేసవి చరమాంకంలో విడుదల అవుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఎలా ఉంటుందో చూడాలి!
లవ్ మీ
‘రౌడీ బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్, ‘బేబీ’ సినిమాతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవీ చైతన్య జంటగా నటించిన సినిమా ‘లవ్ మీ’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా మే 25న థియేటర్స్‌లో విడుదలైంది. దయ్యాన్ని ప్రేమలో దింపే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. భయపెట్టే సన్నివేశాలకు వెరవకుంటే ‘లవ్ మీ’ని లవ్ చేస్తారు.
ప్రసన్నవదనం
విభిన్న చిత్రాలతో విలక్షణతను నిరూపించుకుంటున్న నటుడు సుహాస్. ఇతగాడి సినిమా వస్తుందంటే సరదాగా చూడొచ్చనే అభిప్రాయం ప్రేక్షకులకు ఏర్పడిపోయింది. విభిన్న కథను ఎంచుకొని సుహాస్ తాజాగా నటించిన ‘ప్రసన్న వదనం’ మే 3న ప్రేక్షకులను పలకరించింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లనే రాబట్టింది. కలర్ బ్లైండ్నెస్ ఉన్న యువకుడు ఓ హత్యను చూస్తాడు. మనుషులను గుర్తుపట్టలేని హీరో హంతకుడిని ఎలా గుర్తించాడన్నది కథ. అర్జున్ వై.కె డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఫీల్ అందించింది. ఈ నెల 24 నుంచి ‘ఆహా’లో ‘ప్రసన్నవదనం’ స్ట్రీమింగ్ మొదలైంది. అప్పటికే పాజిటివ్ టాక్ ఉండటంతో… ఇంటిల్లిపాదికీ వేసవి వినోదాన్ని పంచుతున్నది. థియేటర్లలో కన్నా ఓటీటీలో మరింత హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఆ ఒక్కటీ అడక్కు
చాలా కాలం తర్వాత అల్లరి నరేశ్ పూర్తి స్థాయి కామెడీ జానర్లో చేసిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. 1992లో ఈవీవీ సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్ కాంబోలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా మే 3న విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. వేసవిలో నవ్వుల జల్లు కురిపించింది. మ్యాట్రిమొనీ సైట్ల ఆగడాలను కండ్లకు కట్టింది. ‘ఆహా’ వేదికగా ఈ నెల 31న స్ట్రీమింగ్ కానుంది. నరేశ్ మార్కు కామెడీ కుటుంబమంతటికీ వినోదాలు పంచడం ఖాయం.
ఆరంభం
‘C/O కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు మోహన్ భగత్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆరంభం’. ‘కీడా కోలా’తో గుర్తింపు తెచ్చుకున్న రవీంద్ర విజయ్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10వ తేదీన థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం ‘ఈ టీవీ విన్’లో అందుబాటులో ఉంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘కృష్ణమ్మ’. ఈ చిత్రానికి దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ. మే 10న థియేటర్లలో విడుదలైంది. భారీ సినిమాలు లేకపోవడంతో ‘కృష్ణమ్మ’ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే విడుదలైన వారానికే ఓటీటీకి వచ్చేసింది. ఈ నెల 17 నుంచి ‘కృష్ణమ్మ’ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
ఆవేశం
పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్ ఫాజిల్ ప్రధానపాత్రలో నటించిన కామెడీ, యాక్షన్ సినిమా ఆవేశం. జిత్తు మాధవన్ కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్నది. మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నా తెలుగువాళ్లూ దీనిని ఎంజాయ్ చేస్తున్నారు. మే 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. వేసవి వినోదం కోసం ‘ఆవేశం’మంచి ఎంపిక.
రత్నం
విశాల్ కథానాయకుడిగా ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా రత్నం. ఏప్రిల్ 26న తమిళంతోపాటు తెలుగులో థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత వసూళ్లు సాధించలేకపోయింది. హరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. థియేటర్లో సో..సో.. అనిపించుకున్న ‘రత్నం’ ఓటీటీలో మాత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది. యోగిబాబు, సముద్రఖని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా యాక్షన్ ప్రియులకు మంచి వినోదాన్ని పంచుతున్నది.
ఓటీటీలో మరిన్ని
నెట్‌ఫ్లిక్స్
టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్
(డాక్యుమెంటరీ)- మే 22
అట్లాస్ (హాలీవుడ్)- మే 24
క్రూ (హిందీ)- మే 24
అమెజాన్ ప్రైమ్
ద టెస్ట్ 3 (వెబ్ సిరీస్)- మే 23
జీ5
వీర్ సావర్కర్ (హిందీ)- మే 24
డిస్నీ+హాట్‌స్టార్
ద కర్దాషియన్స్ 5
(వెబ్ సిరీస్)- మే 23
ద బీచ్ బాయ్స్
(డాక్యుమెంటరీ)- మే 24
జియో సినిమా
ఆక్వామెన్-2 (తెలుగు)- మే 21
డ్యూన్2 (హాలీవుడ్)- మే 21