‘చదవగానే మనసుకు హత్తుకున్న కథ ఇది. ఇందులో నా క్యారెక్టర్ పేరు రామకృష్ణ. అప్పన్న అనే వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేస్తుంటా. తను ఇచ్చిన అప్పుల్ని వసూలు చేయడం నా పని. అప్పన్నకూ, జనాలకూ మధ్య అనుసంధానకర్తను నేను. ఇందులో నాకో రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో కూడా ఉంటుంది. ఎలాగైనా ఆ స్టూడియోను డెవలప్ చేసి, అప్పన్న నుంచి బయట పడాలని తాపత్రయపడుతుంటా. అలాగే సావిత్రి అనే అమ్మాయి అంటే నాకిష్టం.
ఒకరోజు సావిత్రిని కలవడానికి గడ్డివాము చాటుకు వెళ్తాను. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఇందులో ఆసక్తికరమైన అంశం.’ అని తెలిపారు హీరో మనోజ్ చంద్ర. ఆయన హీరోగా ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మోనికా కథానాయిక. రానా దగ్గుబాటి సమర్పణలో, పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో హీరో మనోజ్చంద్ర విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నాది ఛాలెంజింగ్ రోల్. అందరి సహకారంతో అద్భుతంగా వచ్చింది. ప్రవీణ ఒక పాషన్ ఉన్న డైరెక్టర్. ప్రొఫెనల్గా సినిమాను ముందుకు నడిపించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రానా ఈ సినిమాకు ప్రెజెంటర్ కావడం సినిమాకు హైప్ తీసుకొచ్చింది. వైజాగ్, విజయవాడ, వరంగల్ ఇలా కొన్ని చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ వేశాం. అన్ని చోట్లా మంచి స్పందన వచ్చింది. సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుంది.’ అని చెప్పారు మనోజ్ చంద్ర.