Manoj Bajpaye | అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో సత్య ఒకటి. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కథానాయకులుగా నటించగా… ఊర్మిళ మతోండ్కర్, షెఫాలీ షా హీరోయిన్లుగా నటించారు. ముంబై మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 1998లో జులై 3న విడుదలై సంచలన విజయం అందుకుంది. అప్పటివరకు మూసధోరణి కథలతో నెట్టుకోస్తున్న బాలీవుడ్‌కి అసలైన సినిమాను పరిచయం చేసింది. అంతేకాకుండా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అయితే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సత్య సినిమాకు మనోజ్కేవలం ఆర్జీవీ నుంచి రూ.1 మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడంట.. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు, నిర్మాత హన్సల్ మెహతా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.
హన్సల్ మెహతా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ కేవలం ఒక రూపాయి మాత్రమే పారితోషికంగా తీసుకున్నారని వెల్లడించారు. “సినిమా సైన్ చేసినప్పుడు మనోజ్‌కు రూ.1 ఇచ్చాను. చాలా మద్యం సేవించిన తర్వాత ఆ డబ్బు అతనికి అందించాను. అనురాగ్ కశ్యప్‌కు కూడా రూ.1 మాత్రమే ఇచ్చాను. కానీ సౌరభ్ (సత్యలో కల్లు మామ పాత్ర)కు ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ, సౌరభ్ ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించారు. అనురాగ్ కూడా రచనలో భాగం కావాల్సి ఉన్నప్పటికీ, అతను ‘సత్య’తో బిజీ అయిపోయారు” అని హన్సల్ మెహతా తెలిపారు.
మరోవైపు, మనోజ్ బాజ్‌పాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సత్య’ చేసే సమయంలో తనకు సినీ పరిశ్రమలో పెద్దగా మద్దతు లేని పరిస్థితిని వివరించారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, జీవనోపాధి కోసం కష్టపడ్డానని చెప్పారు. అయితే, ‘సత్య’ సినిమా తన జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని, అది తన కెరీర్‌ను మార్చేసిందని తెలిపారు.
సత్య సినిమా కథ విషయానికి వస్తే.. ముంబైని అండర్ వరల్డ్ రూల్ చేస్తున్న సమయంలో బ్రతుకుదెరువు కోసం అక్కడికి అనాథగా వస్తాడు సత్య (జేడీ చక్రవర్తి). అయితే ఒక హోటల్లో పనిచేస్తున్న సత్యకి లోకల్ డాన్‌తో గొడవ జరగడంతో.. అతడు సత్యని జైలుకి పంపిస్తాడు. జైలులో ఉన్న సత్యకి అండర్ వరల్డ్ డాన్ భీకూ మాత్రే(మనోజ్ బాజ్ పేయ్)తో గొడవ జరుగుతుంది. అయితే సత్య ధైర్యాన్ని చూసిన భీకూ మాత్రే అతడితో స్నేహం చేయాలని చేతులు కలుపుతాడు. ఈ క్రమంలోనే ఇద్దరు జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ముంబాయి మహా నగరాన్ని ఎలా శాసించారు అనేది ఈ చిత్రం కథ.