Maa Inti Bangaram | సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. కొందరు సంవత్సరాల తరబడి అవకాశాల కోసం ఎదురుచూసినా గుర్తింపు దక్కదు. మరికొందరికి ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. ప్రస్తుతం అలాంటి అరుదైన విజయాన్ని అందుకున్న నటి మంజూష ముక్కవల్లి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కిరణ్మయి పాత్రతో మంజూష ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథానాయిక సమంతకు అత్యంత సన్నిహిత స్నేహితురాలిగా కనిపించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కిరణ్మయి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం విశేషం.
సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి మంజూష ‘మంజు కుట్టిల్లు’ పేరుతో సుపరిచితురాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షన్నర మందికి పైగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ, ఆమె వీడియోలకు వచ్చే ఆదరణ మాత్రం అంతకంటే ఎక్కువ. సాధారణ గ్లామర్ కంటెంట్‌కు దూరంగా ఉంటూ, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ వంటి లెజెండరీ నటీమణుల హావభావాలు, డైలాగ్ డెలివరీని అద్భుతంగా అనుకరిస్తూ మంజూష చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందాయి. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా ‘జూనియర్ సూర్యకాంతం’ అని పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మంజూషకు చిన్నప్పటి నుంచే తెలుగు భాష, యాసపై మంచి పట్టు ఏర్పడింది. బీటెక్ పూర్తి చేసిన ఆమె, సాధారణంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంచుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పక్కనపెట్టి నటనపై ఉన్న ఆసక్తితో వినోద రంగంలో అడుగుపెట్టారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన మంజూషకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌ను తన కార్యకలాపాల కేంద్రంగా మార్చుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో సమంతకు స్నేహితురాలి పాత్ర కోసం దర్శకురాలు నందినీ రెడ్డి సరైన నటిని వెతుకుతున్న సమయంలో మంజూష సోషల్ మీడియా వీడియోలు ఆమె దృష్టిని ఆకర్షించాయి. ఆ పాత్రకు మంజూష అయితేనే న్యాయం చేయగలదని దర్శకురాలు మరియు చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్నంత మాత్రాన వెంటనే అవకాశం ఇవ్వకుండా, ఆమెకు మూడు రౌండ్ల ఆడిషన్స్ నిర్వహించారు. ప్రతి దశలో తన నటనతో ఆకట్టుకున్న మంజూష చివరకు కిరణ్మయి పాత్రకు ఎంపికయ్యారు.
మొదటి సినిమానే అయినప్పటికీ, సమంతలాంటి స్టార్ హీరోయిన్ పక్కన మంజూష ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా చాలా సహజంగా నటించారు. స్నేహితురాలి కోసం ఏదైనా చేసే హోమ్‌మేకర్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సమంతతో కలిసి పండించిన కామెడీ సన్నివేశాలు, సహజమైన డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని వన్‌లైనర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’తో వచ్చిన ఈ ఒక్క అవకాశం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్లో కొత్త లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంజూష పేరు బలంగా వినిపిస్తోంది.