Bollywood | ఈ రోజుల్లో మనుషులని గాయపరచడం లేదంటే చంపడం చాలా సులువు అయిపోయింది. కనికరం అనేదే లేకుండా తోటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తన డ్రైవర్ని కత్తితో పొడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలలోకి వెళితే ముంబయి వర్సోవా ప్రాంతంలో ‘రహస్య’, ‘ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్’, ‘వన్ ఫ్రైడే నైట్’ వంటి క్రైమ్ థ్రిల్లర్లకు దర్శకత్వం వహించి పేరు సంపాదించిన దర్శకుడు, నిర్మాత మనీష్ గుప్తా నివసిస్తున్నాడు. అయితే ఈ దర్శకుడిని తన వద్ద పనిచేసే డ్రైవర్ జీతం అడగడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో మనీష్ గుప్తాపై వర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
బాధితుడు మహమ్మద్ లష్కర్ గత మూడేళ్లుగా మనీష్ గుప్తా వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నెలకు రూ. 23,000 జీతం ఇస్తున్నారు. అయితే, గుప్తా తరచూ జీతం ఇవ్వడంలో కాస్త జాప్యం చేస్తున్నాడు. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. గత నెల జీతం కూడా చెల్లించకపోవడంతో పాటు, మే 30న లష్కర్‌ను గుప్తా పనిలోంచి తొలగించాడు ఈ దర్శక నిర్మాత. అయితే జూన్ 3న లష్కర్ తనకు రావాల్సిన జీతం గురించి గుప్తాకి ఫోన్ చేసి అడగ్గా, అప్పుడు నువ్వు విధుల్లోకి వస్తేనే జీతం ఇస్తానని దర్శకుడు అన్నాడట. దాంతో మరుసటి రోజు మహమ్మద్ లష్కర్ విధుల్లో చేరినప్పటికీ, బకాయి జీతం మాత్రం ఇవ్వలేదు.
జూన్ 5న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో వర్సోవాలోని సాగర్ సంజోగ్ భవనంలోని గుప్తా నివాసంలో ఇరువురూ ఉన్నప్పుడు మరోసారి జీతం ప్రస్తావన తీసుకువచ్చాడు లష్కర్. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన మనీష్ గుప్తా వంటగదిలోని కత్తి తీసుకు వచ్చి లష్కర్‌పై దాడి చేశాడు. దాంతో అక్కడ నుండి తప్పించుకొని వాచ్మెన్, మరో డ్రైవర్ సాయంతో విలేపార్లే వెస్ట్‌లోని కూపర్ ఆసుపత్రిలో చేరాడు.ఇక చికిత్స అనంతరం, బాధితుడు వర్సోవా పోలీస్ స్టేషన్లో మనీశ్ గుప్తాపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనీశ్ గుప్తా ఇటీవల రవీనా టాండన్, మిలింద్ సోమన్ నటించిన ‘వన్ ఫ్రైడే నైట్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన రామ్ గోపాల్ వర్మ బృందంలో స్క్రీన్ ప్లే రచయితగా ‘ఢీ’, ‘సర్కార్’ వంటి చిత్రాలకు కూడా పనిచేశాడు. తాజా సంఘటనతో హాట్ టాపిక్ అయ్యాడు.