గోడకు కొట్టిన బంతి.. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మణిశర్మ. ఈయన పని అయిపోయింది.. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో ఉండాల్సిందే.. స్టార్ హీరోలు ఈయన వైపు చూడరు.. కుర్ర సంగీత దర్శకుల ధాటికి మణిశర్మ తట్టుకోలేకపోతున్నాడు.. అంటూ ఏడాది కిందటి వరకు చాలా వార్తలు వచ్చాయి. కానీ బౌన్స్ బ్యాక్ అంటే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చూపించాడు మణిశర్మ. అందులో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి తనలో ఇంకా సత్తా అయిపోలేదు అంటూ అందరికీ నిరూపించాడు.
15 ఏళ్ల కింద ఏ సినిమా పోస్టర్ పై చూసిన మణిశర్మ పేరు తప్ప మరొకటి కనిపించేది కాదు. అలాంటి రోజులు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి అనిపిస్తుంది. ప్రస్తుతం మణిశర్మ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. అందులో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి .