Mani Ratnam | విశ్వనటుడు కమల్ హాసన్ , లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 37 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం జూన్ 5న విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మూడు దశాబ్ధాల క్రితం నాయగన్తో చరిత్ర సృష్టించిన ద్వయం మళ్లీ కలవడంతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనుకొని ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా థియేటర్ లోపలి వెళ్లారు. కాని సినిమా చూసి ఊసురుమంటూ బయటకు వచ్చారు. ఎంతమంది స్టార్స్ ఉన్నా ఏం లాభం. కథ కూడా ఉండాలి కదా అని ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ క్రమంలో ఇండియన్ 2 కన్నా తక్కువ కలక్షన్స్ రాబట్టి డిజాస్టర్ లిస్ట్ లో చేరింది థగ్ లైఫ్.
భాషా వివాదం వలన థగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. దీంతో చాలా నష్టం వాటిల్లింది. ‘థగ్ లైఫ్’ తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుని కేవలం రూ.18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. రెండోరోజుకే సగం థియేటర్లు ఖాళీ అయిపోవడంతో ఈ చిత్రం డిజాస్టర్ అని తేల్చేశారు. అయితే ఇలాంటి పరాజయం చవిచూడడంతో చిత్ర బృందం కూడా నిరాశలో ఉంది. ఇక డిజాస్టర్ తర్వాత మణిరత్నం తొలిసారి స్పందించారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం అంగీకరించారు. ఈ విషయంలో ఆయన ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. ప్రేక్షకులు మరో క్లాసిక్ మూవీని ఆశించారని, ఆ స్థాయిలో సినిమా రాకపోవడంపై ప్రేక్షకులకు క్షమాపణలు తెలుపుతున్నా. మేమెప్పుడూ ‘నాయకుడు’కంటే తక్కువ సినిమా చేయాలని అనుకోలేదు.
నాయకుడు కంటే తక్కువ సినిమాను చేయడం మా ఉద్దేశ్యం కాదు. ఎవరూ అలా అనుకోవద్దు. ఎవరైనా ఆ సినిమా కన్నా తక్కువ ఉండే సినిమా చేయాలనీ అనుకుంటారా.. ? మేము థగ్ లైఫ్ పై ఎక్కువ అంచనాలను పెట్టుకున్నాం.. కాకపోతే మీరంతా కూడా మేము అందించినదానికన్నా ఎక్కువ, భిన్నమైన కథను మా నుంచి కోరుకున్నారని నాకు అర్ధమయ్యింది. అలాంటి మంచి కథతోనే వస్తాను’ అంటూ మణిరత్నం చెప్పారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. సుమారు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తం థియేటర్ రన్లో కనీసం అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి రూ.150 కోట్లకు పైగా నష్టాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.