Mandaadi | ఈ ఏడాది కోలీవుడ్‌లో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘మండాడి’ ఒకటిగా నిలిచింది. టాలెంటెడ్ నటుడు సూరి హీరోగా నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు సుహాస్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సముద్రపు నేపథ్యంతో తెరకెక్కిన ఈ రేసింగ్ డ్రామా ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసింది. దర్శకుడు మథిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా.. సూరి కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు కామెడీ, సహాయ నటుడి పాత్రలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సూరి.. హీరోగా తనలోని మరో కోణాన్ని ఈ సినిమాతో ప్రేక్షకులకు చూపించారు. ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించింది.
‘మండాడి’ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో సాగే కథ, రేసింగ్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథలోని ఉత్కంఠభరితమైన అంశాలను దర్శకుడు మథిమారన్ పుగళేంది ఆసక్తికరంగా తెరకెక్కించడంతో థియేటర్లలో ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. సూరి హీరోగా తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రత్యేకతగా మారింది. మరోవైపు సుహాస్ విలన్ పాత్రలో కనిపించడం తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు విభిన్నమైన కథలు, సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ‘మండాడి’లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు.
థియేటర్లలో మంచి ఆదరణ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లోనూ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి ఐమ్యాక్స్ స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు సమాచారం. దీంతో థియేటర్లలో ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు సైతం ఐమ్యాక్స్ అనుభూతి కోసం మరోసారి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక థియేటర్లలో మంచి రన్ కొనసాగుతున్న సమయంలోనే ‘మండాడి’ డిజిటల్ ప్రీమియర్‌కు కూడా సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. ముఖ్యంగా సూరి నటనతో పాటు సుహాస్ ప్రతినాయక పాత్రను చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు కూడా ఓటీటీ విడుదల మంచి అవకాశంగా మారింది.