‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు మాయం కావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ముంబయిలోని ఓ స్టూడియోలో విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు. ఈ కంటెంట్ ఉన్న హార్డ్‌డిస్క్ సదరు స్టూడియో వారు కొరియర్ ద్వారా ఫిల్మ్‌నగర్‌లోని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫీసుకు పంపించారు. ఇక్కడ పార్శిల్‌ను ఆఫీస్‌బాయ్, ఓ మహిళ తీసుకున్నారు. ఆ తర్వాత వారు తప్పించుకు తిరుగుతున్నారు. ఇదే విషయమై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. ఈలోగా హార్డ్‌డిస్క్‌లు మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
‘కన్నప్ప’ చిత్రాన్ని దాదాపు రెండొందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు ఇందులో భాగమయ్యారు. ఇంతటి ఖరీదైన సినిమాకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ను కొరియర్లో పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ హార్డ్‌డిస్క్‌లో ప్రభాస్‌పై చిత్రీకరించిన కీలక యాక్షన్ ఘట్టాలున్నాయని సమాచారం. వాటిని లీక్ చేస్తారేమోనని చిత్రబృందం భయపడుతున్నది. ఇదంతా తమపై కుట్రతో చేయించారని, ఓ అజ్ఞాత వ్యక్తి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని మంచు విష్ణు టీం అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నది. మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఈ తాజా ఘటన ఆసక్తికరంగా మారింది. ఇక సోషల్‌మీడియాలో మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై శివుడిని ప్రశ్నిస్తూ ‘నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ’ అంటూ మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.