‘కన్నప్ప ప్రతి తరానికి కనెక్ట్ అవుతుంది. ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. వివిధ భాషల్లోని అగ్ర నటుల్ని ఈ చిత్రంలో భాగం చేశాం’ అన్నారు సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు. శుక్రవారం జరిగిన ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు విష్ణు టైటిల్ రోల్లో ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ‘ప్రభాస్ కోసం కృష్ణంరాజు ఈ కథను సిద్ధం చేశారు.
మేము అడిగిన వెంటనే ఆయన కథను ఇచ్చారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చాం. నిర్మాతగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిస్తున్నది’ అన్నారు. కన్నప్ప మైథాలజీ చిత్రం కాదని, రెండో శతాబ్దంలో చోళ రాజుల కాలంలో జరిగిన నిజమైన కథ ఇదని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. అపరశివ భక్తుడి కథగా ‘కన్నప్ప’ అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.