మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27 ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మే8 నుంచి అమెరికాలో మొదలుపెట్టబోతున్నారు.
న్యూజెర్సీలో రోడ్‌షోతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టి, డల్లాస్, లాస్ఏంజిల్స్లో భారీ ఈవెంట్స్‌ను నిర్వహించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ‘ప్రేక్షకుల్లో భక్తి భావాల్ని పెంపొందించే చిత్రమిది. పాటలు, విజువల్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’ అని
మేకర్స్ తెలిపారు.