Manchu Vishnu | గత కొద్ది రోజులుగా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో విష్ణు నటించిన కన్నప్పపై కాస్త నెగెటివ్ కామెంట్స్ చేసిన మనోజ్ మూవీ రిలీజ్ ముందు కన్నప్ప టీమ్‌కి ఆల్‌ది బెస్ట్ చెబుతూ.. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. అలానే సినిమా రిలీజ్ అయ్యాక చిత్రాన్ని చూసిన మంచు మనోజ్ ఊహించిన దాని కన్నా చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. అయితే మంచు మనోజ్ రివ్యూకి సంబంధించి తాజాగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసి, మంచి ఓపెనింగ్ రాబట్టింది. ఈక్రమంలో శనివారం చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ, తమ కుటుంబాన్ని ప్రేమించే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “యాభై ఏళ్లుగా అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు. వారి ప్రేమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని తెలిపారు. సినిమా కోసం శ్రమించిన టీమ్ సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇక హీరో మంచు విష్ణుమాట్లాడుతూ.. ఈ విజయం తనకు భావోద్వేగంతో కూడిన ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కన్నప్ప టీజర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నాం. సినిమా మీదే కాక, మాపైన కూడా దారుణమైన ట్రోల్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
అంతేకాకుండా, సినిమా కోసం తన ఆస్తులన్నింటినీ బ్యాంక్‌కు తాకట్టు పెట్టినట్టు వెల్లడించారు. సినిమా భారీ ఓపెనింగ్‌కు కారణం ప్రభాస్ అని స్పష్టం చేశారు. ఆయనకోసమే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఆ తర్వాతే కథ వారిని ఆకట్టుకుంది అని చెప్పారు. ఈ విజయం తన తండ్రి మోహన్‌బాబుకు, అభిమానులకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. తమ్ముడు మంచు మనోజ్ ‘కన్నప్ప’పై ప్రశంసలు గుప్పించగా, విష్ణు స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అయితే, అతని పేరు ప్రస్తావించకుండా, తమ్ముడి ప్రశంసలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ని కోట్ల వసూలు కంటే ఈ కథ ఎంత మందికి చేరిందన్నదే నాకు ముఖ్యమైన విషయం అని చెప్పారు మంచు విష్ణు. నాగార్జున , అల్లు అరవింద్, కోన వెంకట్, బీవీఎస్ రవి, బ్రహ్మానందం వంటి వారు ఫోన్ చేసి అభినందించారని విష్ణు పేర్కొన్నాడు.