Manchu Manoj protest in front of Mohan Babu’s residence | మంచు కుటుంబంలో మళ్లీ వివాదాలు తలెత్తాయి. కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చిన మంచు మనోజ్, మంచు విష్ణు సోదరులు తాజాగా మరో వివాదానికి దారి తీశారు. తన అన్న మంచు విష్ణు 150 మంది వ్యక్తులతో కలిసి అక్రమంగా జల్పల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లోకి చొరబడి ఆస్తినాశనం చేశారని మనోజ్ ఆరోపించారు. ఇంట్లోకి ప్రవేశించి బట్టలు, వస్తువులు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని విష్ణు ఈ చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించారు. అక్కడ ఉన్న రెండు కార్లను టోయింగ్ వాహనంతో తీసుకెళ్లి రోడ్డుపై వదిలేశారని తెలిపాడు.
అయితే.. చోరీకి గురైన తన కారు మంచు విష్ణు కార్యాలయంలో కనిపించిందని మనోజ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై నార్సింగ్ పోలీసులు కేసు దాఖలు చేసి, దొంగిలించబడిన కారును తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కారును దొంగిలించిన వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు తనకు న్యాయం చేయాలంటూ మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి గేటు వద్ద ధర్నాకు దిగాడు. దీంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోహన్ బాబు నివాసానికి ఒక కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.