Mirai | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ “మిరాయ్” సినిమాతో విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, రూ. 100 కోట్ల మార్క్‌కు చేరువైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయవాడలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించింది.ఈ వేడుకలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, దర్శకుడు బాబీ కొల్లి, రచయిత బీవీఎస్ ప్రసాద్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో మంచు మనోజ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ఈరోజు నేను ఈ వేదిక మీద ఉన్నానంటే, దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. చిన్నవాడైనా ఆయన టాలెంట్‌కి నా వందనం. సినిమా రిలీజ్ అయ్యాక నా మనసుకి హత్తుకున్న విషయం ఏంటంటే.. నా అమ్మ నిర్మలాదేవి సినిమా చూసిన తర్వాత నన్ను కౌగిలించుకొని ఏడ్చారు. ‘నువ్వు మహావీరుడిలా అదిరిపోయావ్’ అని చెప్పారు. ఎన్నో ఏళ్ల తర్వాత మా అమ్మ కళ్లలో ఆనందం చూశాను. ఆ రోజంతా ఫోన్లు చేస్తూ మా బిడ్డ హిట్టు కొట్టాడంటూ చెప్పిన ఆమెను చూస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పక మానలేను,” అని చెప్పారు. ఇక ఈ ఇండస్ట్రీలో ఎవడైనా పెద్ద హీరో అవ్వొచ్చు. బ్యాగ్రౌండ్ లేకుండా మౌళి ‘లిటిల్ హార్ట్స్’తో హిట్ కొట్టాడు. యాక్టర్ అవ్వాలంటే చిరంజీవి కొడుకో, మోహన్ బాబు కొడుకో కావాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు. మౌళి రేపు ఏ సినిమా చేసినా, నన్ను అడిగితే, నేను అతని సినిమాలో తప్పకుండా విలన్ క్యారెక్టర్‌గా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కానీ చేస్తాను అని హామీ ఇచ్చారు.
మా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మూడు సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ప్రభాస్ హీరోగా ఆయన చేస్తున్న ‘రాజా సాబ్’ వేరే లెవెల్లో ఉంది. అలాగే నా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా, మీడియా, ఫ్యాన్స్ ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు అని మనోజ్ చాలా భావోద్వేగంగా మాట్లాడాడు. అదే సమయంలో వేదికపైకి వచ్చిన ఒక అభిమాని మంచు మనోజ్ కాళ్లు మొక్కగా, మనోజ్ తిరిగి అభిమాని కాళ్లకు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు.. హీరోయిన్ రితికాపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో మంచు మనోజ్.. ఆర్ఆర్ఆర్ దగ్గరకు వెళ్లి ఏంటి కథ అంటూ సైగ చేసి పక్కకు లాగగా, ఆ సమయంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
RRR ని ఆట పట్టించిన Manoj Manchu#Mirai pic.twitter.com/H6D4tOSNIM
— idlebrain jeevi (@idlebrainjeevi) September 16, 2025