Manchu Manoj | కుటుంబ వివాదాలతో మంచు మోహన్‌బాబు కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న తన కారు చోరీకి గురైందని పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఈ చోరి వెనుక తన సోదరుడు మంచు విష్ణు హస్తం ఉందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి వచ్చిన మనోజ్, గేటు వెలుపల ధర్నా చేస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమది ఆస్తి గొడవ కాదని.. నాకు ఈ ఆస్తి అవసరం లేదని ఎప్పుడో నాన్నకు చెప్పేశానంటూ మనోజ్ తెలిపారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి వెళ్లాలనే అతడు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్లు మనోజ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నానని. అక్కడే ఈ గొడవ మొదలైందని తెలిపారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటివరకూ ఛార్జ్‌షీట్ నమోదు చేయలేదని మనోజ్ వాపోయారు.
ఈ నెల 1న తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో విష్ణు ఈ పథకం వేసి ఈ ఘటనలన్నీ జరిగేలా చేశారని ఆరోపించారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు వచ్చి కార్లను తీసుకెళ్లడంతో పాటు, తన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని మనోజ్ వివరించారు. కమిషనర్ ఇచ్చిన బైండోవర్‌ను వారు పదేపదే ఉల్లంఘించారని, చోరీ గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఇంట్లోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి అడుగుతున్నారని, మోహన్‌బాబు చెప్పిన తర్వాతే లోపలికి పంపుతామని అంటున్నారని మనోజ్ తెలిపారు. తన కుటుంబ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నా కుటుంబం నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను బయట ఒక సినిమా హిట్టు కొడితే నన్ను తీసుకువచ్చి సొంత ప్రోడక్షన్లో సినిమా చేయాలి అనేవారు. అలా చేసిన చేతికి ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లు కాదు. తనను స్టార్ చేయడం కోసం మా నాన్న చెప్పాడని విష్ణు సినిమాలో లేడి గెటప్‌లో నటించాను. నా సినిమా భైరవం వస్తుందని తన సినిమా కన్నప్ప పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నేను భైరవం తీసుకువచ్చాననే కోపంతో ఎలా పగ తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడంటూ మనోజ్ చెప్పుకోచ్చాడు.