Manchu Manoj – Manchu Vishnu | మంచు కుటుంబంలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మోహన్ బాబు కుమారులైన మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గత కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే, ఇటీవల మంచు కుటుంబంలో మరోసారి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంచు మనోజ్‌కు చెందిన కారు చోరీకి గురైనట్లు ఆయన డ్రైవర్ నార్సింగి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. తన నివాసం వద్ద ఉన్న కారును తన సోదరుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు దొంగలు ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపించినట్లు సమాచారం. ఆ కారు విష్ణు కార్యాలయంలో ఉన్నట్లు కనుగొన్నట్లు తెలిపారు.
ఈ విషయంపై మంచు మనోజ్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 1న తమ కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం రాజస్తాన్‌కు వెళ్లినట్లు వెల్లడించారు. ఆ సమయంలో జల్పల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లోకి 150 మంది దుండగులు చొరబడి ఆస్తినాశనం చేశారని ఆరోపించారు. ఇంట్లోకి ప్రవేశించి బట్టలు, వస్తువులు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని విష్ణు ఈ చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించారు. అక్కడ ఉన్న రెండు కార్లను టోయింగ్ వాహనంతో తీసుకెళ్లి రోడ్డుపై వదిలేశారని తెలిపారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినందున తొలుత ఫిర్యాదు చేయాలా వద్దా అని సందిగ్ధంలో పడినట్లు పేర్కొన్నారు.
అయితే, అంతటితో ఆగకుండా తన కార్యాలయానికి వచ్చి కారును చోరీ చేసి విష్ణు నివాసంలో పార్క్ చేశారని మనోజ్ ఆరోపించారు. జైపూర్ నుంచే తాను సీఐకి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు సమర్పిస్తామని తెలిపారు. పోలీసుల విచారణలో కారు విష్ణు కార్యాలయంలో దొరికినట్లు పేర్కొన్నారు. కారును తిరిగి తీసుకురావడానికి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌లోని వారి కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. దుండగులు తన విల్లా గోడలు దూకి, ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారని మనోజ్ ఆరోపించారు.