Manchu Manoj | తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మరింత దగ్గరైంది. వామపక్ష పార్టీలతో పాటు వీసీకే మద్దతు ప్రకటించడంతో టీవీకే మ్యాజికల్ ఫిగర్‌ను అందుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు వినియోగించుకోనున్నారని సమాచారం.ఇదిలా ఉంటే, ఈ రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విజయ్‌పై తన అభిమానాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తమిళనాడులో ప్రజల తీర్పే అత్యున్నత శక్తి. మార్పు కోసం ప్రజలు ఏకం అయితే చరిత్ర కూడా మారిపోతుంది అంటూ ప్రారంభించిన మంచు మనోజ్, విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసించారు. ఎన్నో ట్రోల్స్, విమర్శలు, అడ్డంకులు ఎదురైనా, తన తొలి ఎన్నికలలోనే విజయ్ తన సత్తా నిరూపించుకున్నారని పేర్కొన్నారు. దళపతి విజయ్ అనే పేరు ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఆశకు ప్రతీకగా మారుతోంది. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకులను తమిళనాడు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల భావోద్వేగానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.
ఇక తమిళనాడులో ఎన్నికల అనంతర పరిణామాలపై కూడా మంచు మనోజ్ స్పందించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే మళ్లీ ఒక్కటవుతాయన్న ప్రచారాన్ని కేవలం పుకార్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజల తీర్పును ఎదుర్కొంటున్న ఆ పార్టీలకు ప్రజాస్వామ్య విలువలు బాగా తెలుసని చెప్పారు.అలాగే “తమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక శక్తి అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించడం చారిత్రక ఘట్టం” అంటూ విజయ్ ఎదుగుదలను కొనియాడారు. కోట్లాది మంది ప్రజలు తమ ఆశలు, విశ్వాసం ఒక్క వ్యక్తిపై ఉంచారని, ఆ వ్యక్తే విజయ్ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యంత ముఖ్యమని, అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే తొలి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమని మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. చివరగా “ఇది కేవలం ఒక్క వ్యక్తి విజయం కాదు.. ప్రజల విశ్వాసానికి దక్కిన గౌరవం” అంటూ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్‌తో పాటు విజయ్ ఫోటోను కూడా షేర్ చేసిన మంచు మనోజ్, తాను దళపతి అభిమానినని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.