Manchu Lakshmi | మంచు మోహన్‌బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీమణి మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ సినీ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదంగా మారింది.ఇంటర్వ్యూలో మూర్తి “50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు.
“ఇలాంటి ప్రశ్న అడిగే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మహేశ్ బాబుకి కూడా 50 ఏళ్లు వస్తున్నాయి. ఆయన షర్ట్ ఎందుకు విప్పి తిరుగుతున్నారు అని మీరు అడగగలరా? ఒక మహిళను ఎందుకు ఇలాగే ప్రశ్నిస్తారు?” అంటూ ఆమె కడిగిపారేశారు.ఈ ఘటనపై నెటిజన్లు మంచు లక్ష్మికి మద్దతు తెలుపుతూ “కరెక్ట్‌గా బుద్ధి చెప్పావు అక్కా” అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె అక్కడితో వదలకుండా తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.
తన ఫిర్యాదులో మంచు లక్ష్మి మాట్లాడుతూ, “నాలుగేళ్ల తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తూ నా తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించే ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డాం. కానీ ఆ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఒక్క మాట అడగకుండా, నా వయసు, శరీరం, దుస్తులపై కించపరిచేలా ప్రశ్నించారు. ఇది జర్నలిజం కాదు, కేవలం వైరల్ కావాలని చేసిన ప్రయత్నం. మగవాళ్లు ఎక్కువగా ఉన్న ఈ పరిశ్రమలో నేను సాధించిన స్థాయిపై గర్వంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మౌనం వహించి వదిలేస్తే మరింత పెరుగుతుంది. అందుకే వీఎస్ఎన్ మూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.ఈ సంఘటన ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. జర్నలిజం పరిమితులు, మహిళలపై ప్రవర్తన, సినీ పరిశ్రమలో గౌరవం వంటి అంశాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.