Mana Shankara Varaprasad garu | మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. చిరు ఎనర్జీ, నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ స్టైల్ వినోదం కలిసి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, చార్ట్‌బస్టర్ సాంగ్ ‘మీసాల పిల్ల’ సినిమా చుట్టూ హైప్ మరింత పెంచాయి.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్న కీలక పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది. ఇది కేవలం అతిథి పాత్ర కాకుండా కథలో ప్రధానమైన క్యారెక్టర్‌గా రూపొందించబడింది. చిరు–వెంకీ కలయికకు అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, చివరకు ఈ కాంబినేషన్ కుదరడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్క్రీన్‌పై స్టైలిష్ మాస్ స్టెప్పులు వేయనున్నారని తెలిసి ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రంగురంగుల భారీ కార్నివాల్ సెట్లో చిరంజీవి – వెంకటేష్‌లపై ఓ ఎనర్జిటిక్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సెట్లో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటుండటం విశేషం. పండుగ వాతావరణాన్ని తలపించేలా కలర్‌ఫుల్ థీమ్, గ్రాండ్ కాస్ట్యూమ్స్, వైబ్రంట్ అట్మాస్ఫియర్‌తో మేకర్స్ ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.
‘మీసాల పిల్ల’ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో దాని కొరియోగ్రాఫర్ పోలంకి విజయ్ కొత్త డ్యాన్స్ నంబర్‌కు కూడా డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన బాణీలు ఇప్పటికే సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. చిరు–నయనతారలపై కేరళలో చిత్రీకరించిన మెలోడీ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. వినోదం, భావోద్వేగం, మాస్ ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో సినిమా రూపొందుతుందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు