‘ నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీతో పనిచేయడం ఆనందంగా ఉంది. తనతో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. తనతో ఎంజాయ్ చేస్తూ నటించాను. ఏదేమైనా ఈ సినిమా స్థాయిని పెంచిన వెంకీకి థ్యాంక్స్ చెబుతున్నా. మేమిద్దరం పూర్తిస్థాయి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అనిల్ రావిపూడి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే ఇంకా హ్యాపీ. అనిల్ రావిపూడితో నీ కాంబినేషన్ బావుంటుందని కె.రాఘవేంద్రరావు కొన్నాళ్ల క్రితం అన్నారు. అనుకోకుండా ఆయన చేతులతోనే ఈ సినిమా మొదలైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ ఈ కథ నాకు చెప్పాడు. ఇందులో వినోదం ఉంది. భావోద్వేగాలున్నాయి. వైవిధ్యంగా చేద్దాం అనుకున్నాను.
కానీ ‘అస్సలు వద్దు.. మీ పాత సినిమాల్లోని నటనను గుర్తు చేసేలా నటిస్తే చాలు.. మీరంటే ఏంటో ఈ జనరేషన్‌కి పరిచయం చేయాలనుకుంటున్నా’ అన్నాడు అనిల్. నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో అలా నా పాత్రను తీర్చిదిద్దాడు. అతనితో పనిచేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఆఖరు రోజున ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా ఆల్రెడీ సూపర్‌హిట్ అయిపోయింది. బడ్జెట్ దాటనీయకుండా, టైమ్‌కు సినిమా తీసేశాడు. ఆ విధంగా తొలి విజయం సాధించాడు. ఇక మిగిలింది రిలీజ్ తర్వాత ఎలాగూ దక్కుతుంది. ఈ సంక్రాంతి తెలుగు సినిమా గర్వించే సంక్రాంతి అవ్వాలి. సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
ఆయన హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించిన మరో అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ ‘చిరంజీవితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఇందులో ఇద్దరం రఫ్ ఆడేశాం. నా తమ్ముళ్లు మహేశ్, పవన్‌కల్యాణ్‌లతో సినిమాలు చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేశాను. మోత మోగిపోవాలి. అనిల్‌తో నా కాంబినేషన్ సామాన్యమైనది కాదు. అన్నీ హిట్సే. అద్భుతమైన టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మంచి ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి రాబోతున్నది. హిట్ చేస్తారని ఆశిస్తున్నా.’ అన్నారు.
‘ఇది నా 9వ సినిమా. ఎట్టకేలకు మెగాస్టార్ దగ్గరకొచ్చి ల్యాండ్ అయ్యాను. ఈ ప్రాసెస్‌లో నేను పనిచేసిన హీరోలకు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. విక్టరీ వెంకటేశ్‌గారితో నా నాలుగో సినిమా ఇది. ఆయన పాజిటివిటీకి మనిషి రూపం. ఇందులో ఆయన ‘వెంకీగౌడ కర్ణాటక’లా కనిపిస్తారు. వెంకీ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి కారణం చిరంజీవిగారే. ఇక మెగాస్టార్ చిరంజీవి. 150పై చిలుకు సినిమాలు, కేంద్రమంత్రి, పద్మభూషణ్, పద్మవిభూషణ.. ఇన్ని సాధించిన వ్యక్తి ఇంత డౌన్‌టూ ఎర్త్ ఎలా ఉంటారు? అనేది అంతుచిక్కని ప్రశ్న. ఆయనతో నా ప్రయాణాన్ని జీవితంలో మరిచిపోలేను. ఇదో నాస్టాజికల్ ఫీలింగ్. ఆయన అనుభవాలన్నీ కలిపి ఆవకాయ ముద్దలా మా కందించారు. ఇదో ఫుల్‌మీల్స్ లాంటి సినిమా. ఈ సంక్రాంతికి మీకు కావాల్సినంత వినోదాన్ని పంచే సినిమా.’ అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.