అనారోగ్యం కారణంగా నటనకు కొంత విరామం ఇచ్చిన మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, మళ్లీ తన సినిమాలతో బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా సినిమా ‘కలాంకావల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలిస్తూ బిజీబిజీగా ఉన్నారు మమ్ముట్టి. ఈ నేపథ్యంలో పాత్రల ఎంపిక గురించి, నటన గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ‘కెరీర్లో రొమాంటిక్ పాత్రలు చాలా చేశా. ఇప్పుడు నా వయసు 74. ఇప్పటికి కూడా అలాంటి పాత్రలు చేయమని అభిమానులు అడుగుతున్నారు.
నిజానికి నేను చేస్తానంటే ఆ తరహా పాత్రల్ని సృష్టించేందుకు దర్శకులు, రచయితలు సిద్ధంగానే ఉన్నారు. కానీ, ఈ వయసులో అలాంటి పాత్రలు చేయడం సరికాదు. ఇంత అనుభవం, వయసు వచ్చాక అందుకు తగ్గ పాత్రలనే ఎంచుకోవాలి. ఇంకా ఈ వయసులో వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే హీరో అంటే కొన్ని పరిమితులుంటాయి. విలన్‌కు ఎలాంటి పరిమితులూ ఉండవ్. ఏదైనా కొత్తగా వెళ్లినప్పుడే మనలోని విషయం బయటకు వచ్చేది.’ అంటూ చెప్పుకొచ్చారు మమ్ముట్టి. త్వరలో రానున్న ‘కలాంకావల్’ చిత్రంలో మమ్ముట్టి విలన్‌గా నటిస్తుండటం విశేషం.