Bethlehem Kudumba Unit | మలయాళ సినీ పరిశ్రమలో సంచలన విజయాలను నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సరికొత్త ఫీల్-గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఘనంగా విడుదల చేయబోతుంది.
యువ కథానాయకుడు నివిన్ పౌలి (Nivin Pauly) హీరోగా, సెన్సేషనల్ నటి మమితా బైజు (Mamitha Baiju) నాయికగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించారు. కేరళలో ఓణం కానుకగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షాన్ని అందుకుంది. ముఖ్యంగా నివిన్ పౌలి నటన మరియు మమితా బైజుతో ఆయన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో కట్టుపడేసింది.
ఇక ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన మమితా బైజు నటిస్తున్న మరో చిత్రం కావడంతో టాలీవుడ్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భావనా స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫ్యూచర్ రన్-అప్ సహకారంతో మైత్రీ రిలీజ్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. మలయాళంలో తిరుగులేని విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా కచ్చితంగా అలరిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.