Samyuktha Menon | ‘మాస్టారూ.. మాస్టారూ.. నా మనసును గెలిచారు’.. అంటూ ‘సార్’తో మరోసారి అభిమానులకు దగ్గరైంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అందం, అభినయంతో జనం హృదయాల్లో చోటు సంపాదించుకున్నది సంయుక్త. జీవితం గురించి, జీవన తత్వం గురించి తను లోతుగానే మాట్లాడుతున్నది..
నేను కేరళ కుట్టిని. పాలక్కాడ్ మా ఊరు. చిన్మయ విద్యాలయలో స్కూలింగ్ అయిపోయింది. ఎకనమిక్స్‌లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత, తీరిగ్గా పాప్‌కార్న్ తింటూ సినిమాలు చూసేదాన్ని. 2016లో నిజంగానే ‘పాప్‌కార్న్’ సినిమాతో మలయాళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. ‘బింబిసార’ గురించి చెప్పేదేముంది? ప్రస్తుతం తమిళంలో ‘బూమరాంగ్’ అనే చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో కథలు వింటున్నా. ఓ పెద్ద హీరోతో కలిసి నటించబోతున్నా. ఆ వివరాలు త్వరలోనే పంచుకుంటా. అప్పటివరకూ.. సైలెన్స్ ప్లీజ్!
చీకట్లో నడుస్తున్నవాడు భయంభయంగా చూసినప్పుడు మర్రిచెట్టు కూడా జుట్టు విరబోసుకున్న దయ్యంలా అనిపిస్తుంది. అదే ధైర్యంగా అడుగువేస్తే.. ఓ పెద్ద సైన్యంలా కనిపిస్తుంది. ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మొదట్లో నాకు తెలుగు అంటే భయం. కానీ కాన్ఫిడెన్స్‌తో దాన్ని గెలిచాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నా.
Samyuktha Menon2
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం చేసిన మంచి మనల్ని రక్షిస్తుంది. మనం చేసిన చెడు నీడలా వెంటాడుతుంది. కృష్ణభగవానుడు చెప్పిన ఈ మాట.. అక్షర సత్యమని భావిస్తాను. సాధ్యమైనంత వరకూ మంచి చేయడానికే ప్రయత్నిస్తాను. పొరపాటున నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే ‘సారీ’ చెప్పేస్తాను. ఏదో ఓ రూపంలో ఆ నష్టాన్ని పూడ్చేస్తాను.
పెద్ద సినిమాలకు పనిచేస్తున్న ప్రతిసారీ ఓ సమస్య ఉంటుంది. మీడియా వాళ్లేమో.. మీ పాత్ర గురించి చెప్పండి? కథ గురించి చెప్పండి? అని గుచ్చిగుచ్చి అడుగుతుంటారు. చెప్పకపోతేనేమో.. అహంభావమని అనుకుంటారు. చెబితేనేమో లీకులు వచ్చేస్తాయి. దానికి ఇంకేదో జోడించి ప్రచారం చేస్తారు. అంతిమంగా సినిమాకు నష్టం. అలాంటి సమయాల్లో నేను.. ఓ నవ్వు నవ్వి ‘నెక్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ తప్పించుకుంటాను. పరిశ్రమలో బతకాలంటే ఆ మాత్రం లౌక్యం ఉండాల్సిందే.
Samyuktha Menon3
నా జీవితానుభవం పెరిగింది. మునుపటి కంటే స్ట్రాంగ్ అయ్యాను. విమర్శల్ని తట్టుకోలుగుతున్నా. నాపై ప్రేమ కురిపించే వారికి థ్యాంక్స్ చెప్పలేను. వారిచ్చిన ప్రేమను తిరిగి వారికే ఇవ్వడం కరెక్ట్. అది ఏ రూపంలో అయినా కావచ్చు.
జీవితమంటే ఏదో సాధించడం.. గొప్పవాళ్లం అయిపోవడమేనా? బతకడమే జీవితం కానేకాదు. బతికినన్ని రోజులు జీవించాలి. ప్రేమించాలి. ప్రేమను పొందాలి. నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. ప్రపంచంలో అంతకుమించింది ఏదీ లేదు. నేను నమ్మే ఫిలాసఫీ ఇదే. అవార్డులు, రివార్డులు మన ప్రతిభను బట్టి వస్తాయి. కానీ ప్రశాంతత మన మనసుపై ఆధారపడి ఉంటుంది.
“Samyuktha Menon | సార్ మూవీ సక్సెస్ మీట్లో సంయుక్త మీనన్”