Actor Vinayakan | రజనీకాంత్ జైలర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఓ హోటల్లో సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఆయనను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనను విడుదల చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినాయకన్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ నెల 2వ తేదీ నుంచి కొల్లంలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. గురువారం ఆయన హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తుండగా మద్యం మత్తులో సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో హోటల్ సిబ్బంది అంచలుమూడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118 (ఎ) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో ఉంటే చర్యలు తీసుకుంటారు.
ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ, వినాయకన్ బాగా మద్యం తాగి ఉన్నారు. ఆయన పోలీసులతో సహా అందరినీ గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు” అని తెలిపారు. వినాయకన్‌తో పాటు ఉన్న వారిలో ఒకరు పూచీకత్తు సమర్పించడంతో ఆయనను స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, నటుడు వినాయకన్ గతంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. కొద్ది నెలల క్రితం మద్యం మత్తులో తన ఇంటి పక్కన వారితో గొడవపడినందుకు ఆయనను మందలించారు. అంతకుముందు కొచ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కూడా జరిగింది. తాజా ఘటనతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.