Nivin Pauly | మలయాళం సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్లకు సంబంధించి జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇక హేమ కమిటీ నివేదిక (Justice Hema Committee Report) బయటకు వచ్చిన తర్వాత లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము కాస్టింగ్ కౌచ్‌కి గురయినట్లు తెలుపుతున్నారు. అయితే తాజాగా మలయాళం స్టార్ నటుడు నివిన్ పౌలి తనను రేప్ చేశాడంటూ ఓ యువ నటి కేసు నమోదు చేసింది
మలయాళ నటుడు నివిన్ పౌలీ (Nivin Pauly) ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ నటుడిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. ఆ సినిమా గురించి చర్చించాలంటూ తనను దుబాయ్ తీసుకెళ్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు కాగా.. ఏ6 గా నివిన్ పౌలీ పేరును చేర్చారు పోలీసులు. అయితే ఈ కేసుపై ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిపిన పోలీసులు నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇక నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు.
అయితే తనపై నమోదైన కేసు గురించి హీరో నివిన్ పౌలీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు నాపై కేసు నమోదు అయినట్లు నా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా ఆవాస్తవం. నాపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోండి. ఈ కేసులో నేను నిర్దోషి అని నిరూపించేందుకు ఎంత వరకైనా వెళ్తాను. అలాగే ఇది చేసిన వారిని వెలుగులోకి తీసుకువస్తాను. నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జరగాల్సినవి అన్ని లీగల్‌గానే జరుగుతాయి అంటూ నివిన్ రాసుకోచ్చారు.