త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అగ్ర హీరో మహేష్‌బాబు. ఈ సినిమా అనంతరం ఆయన రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి హంగులతో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు పలువురు అగ్రశ్రేణి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని తెలుస్తున్నది.
ఈ సినిమా స్క్రిప్ట్‌పై రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక మహేష్‌బాబు తన పాత్ర కోసం భారీ కసరత్తులు చేయబోతున్నారని తెలిసింది. సుశిక్షుతులైన నిపుణుల పర్యవేక్షణలో బాడీ మేకోవర్‌తో పాటు యాక్షన్ ఘట్టాల్లో శిక్షణ పొందనున్నారట. హనుమాన్ను స్ఫూర్తిగా తీసుకొని సూపర్‌హీరో తరహాలో మహేష్‌బాబు పాత్రను తీర్చిదిద్దబోతున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది.