దివంగత సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్ హాల్‌ను నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పద్మాలయా స్టూడియోస్ ప్రాంగణంలో ఈ స్మారక భవనం నిర్మించాలని వారు భావిస్తున్నారు. ఇందులో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల విశేషాలు, ఆయన నట ప్రయాణంలో అందుకున్న పురస్కారాల వివరాలు, వాటి జ్ఞాపికలను పొందుపర్చనున్నారు.
కృష్ణ నట జీవితంలోని అరుదైన ఘట్టాలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సినీ ప్రియులు కృష్ణ సాధించిన కీర్తిని మరోసారి గుర్తు తెచ్చుకునేలా ఈ స్మారక కట్టడాన్ని నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. దీనిపై కృష్ణ కుటుంబ సభ్యులు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తున్నది.