అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తానని, వాళ్లకు నచ్చేలా నటిస్తానని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, హీరో సుధీర్ బాబు, సముద్రఖని తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
పోకిరీ సినిమా రోజులు గుర్తొచ్చాయి: మహేష్ బాబు
మనమంతా ఇలాంటి కార్యక్రమం చేసుకుని రెండేండ్లవుతున్నది. ఒక్కడు సినిమా చూసి దర్శకుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని పరశురామ్ చెప్పారు. ఇవాళ నాకు, నా అభిమానులకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యాడు. ఈ చిత్రంలో ఆయన నన్ను కొత్తగా చూపించారు. నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇది. మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతిదీ వెరైటీగా డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటిస్తుంటే పోకిరీ రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్ చూశాక మీరంతా ఎంత ఎంజాయ్ చేశారో, నేనూ అంతే ఆస్వాదించాను. చాలా హైలైట్స్ ఉంటాయి. హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ అందులో ఒకటి. ఈ సీన్స్ కోసమే రేపు మళ్లీ మళ్లీ సినిమా చూస్తారు. కీర్తి సురేష్ పాత్ర సరదాగా సాగుతుంది. థమన్ మ్యూజిక్ సెన్సేషన్. మా మధ్య అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌ్ండ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ రెండేళ్లలో మనకు దగ్గరైన వాళ్లు ఎంతోమంది దూరమయ్యారు. అయినా నేను ముందుకు వెళ్లడానికి మీ ప్రోత్సాహం చాలు. ఈ నెల
12న ఘన విజయాన్ని చూడబోతున్నాం.
మహేష్ తో పోటీ పడలేకపోయా: కీర్తి సురేష్
మైత్రీ మూవీ మేకర్స్ లో గతంలోనే నటించాల్సింది కొన్ని కారణాల వల్ల నటించలేకపోయాను. కళావతి క్యారెక్టర్ నాకు ఇచ్చిన దర్శకుడు పరశురామ్ కు కృతజ్ఞతలు. మహేష్ తో నటిస్తున్నప్పుడు ఆయన టైమింగ్ మ్యాచ్ చేయగలనా? లేదా అని టెన్షన్ పడ్డాను. డబ్బింగ్ చెబుతుంటే ఆయన గ్లామర్ తో సరిపోతానా? అని భయపడ్డాను. ఈ సినిమా మీకొక సెలబ్రేషన్ అవుతుంది
ఆ నవ్వే ప్రోత్సహించింది: పరశురామ్
మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కల. మహేష్ కు ఈ కథ చెప్పడం ప్రారంభించినప్పుడు మొదటి ఐదు నిమిషాలకే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వే ప్రోత్సాహమై నన్ను ఇక్కడిదాకా నడిపించింది. సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. నాకు ఇంత పెద్ద స్పాన్ సినిమా ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా పెద్ద హిట్ అందుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో దర్శకులు గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్, బుచ్చిబాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, నిర్మాతలు వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, సంగీత దర్శకుడు థమన్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.