Sandeep Reddy Vanga | సూపర్ స్టార్ మహేశ్ బాబు, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’, సందీప్ వంగా కమిట్ అయిన ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వీరిద్దరి కలయికలో సినిమా రావడం ఇదే మొదటి ఆలోచన కాదు. గతంలో ఏషియన్ సినిమాస్ నిర్మాణంలోనే మహేశ్, సందీప్ వంగా కలిసి ‘డెవిల్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరికీ ఈ నిర్మాణ సంస్థ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మహేశ్ ‘వారణాసి’ చిత్రం ముగిసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.