Mahesh Babu | బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై మంచి విజయం సాధించిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.హాలీవుడ్లో 2018వ సంవత్సరంలో విడుదలైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు. చిత్రానికి మ్యూజిక్ శంకర్ అందించారు. సుమారుగా 90 కోట్ల రూపాయలతో చిత్రాన్ని రూపొందించారు.
సితారే జమీన్ పర్ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు అమీర్ ఖాన్ . ఇండియాలో 3500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ కలెక్షన్లు భీభత్సంగా లేకపోయినా క్రమంగా ఊపందుకుంటున్న వైనం చూసి అమీర్ ఖాన్ హమ్మయ్య అనుకుంటున్నాడు. బాలీవుడ్ వర్గాల ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా 60 కోట్ల దాకా వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీకి ఆదివారం బాగానే కలెక్షన్స్ వచ్చాయి..
అయితే ఈ మూవీకి మహేష్ బాబు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం పాజిటివిటీని పెంచింది. ‘సితారే జమీన్ పర్’ ఒక అద్భుతమైన సినిమా అని వర్ణించారు. అమిర్ ఖాన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఒక క్లాసిక్ చిత్రంగా ఉంది.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు. ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, క్లాప్స్ కొట్టేలా చేస్తుంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆయన మాటలు సినిమాపై కొంత ఆసక్తిని కలిగించాయి. ఇక ఈ మూవీ ఎనిమిది వారాల తర్వాత యూట్యూబ్ పే పర్ వ్యూ మోడల్ లో రావొచ్చని రిలీజ్ కు ముందే జోరుగా ప్రచారం జరిగింది. ఓటిటి సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా అమీర్ నో చెప్పాడు.