మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి మాత్రం ఈవేమీ పట్టించుకోకుండా కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఓ వైపు ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాపులు జరుగుతున్నాయి. మరోవైపు దర్శకధీరుడి పిలుపుకోసం మహేశ్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
వారణాసి నేపథ్యంలో ఈ సినిమా కథ మొదలవుతుందట. ఆ తర్వాత కథ సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తాన్నీ ఓ సెట్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట రాజమౌళి. దానికోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నారనేది ఇన్సైడ్ టాక్. కథ ప్రకారం అటవీ నేపథ్యం ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నది.
దానికోసం దట్టమైన అటవీ ప్రాంతాలను కూడా రెక్కీ చేస్తున్నారట. ఇప్పటికే కీరవాణి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఇండోనేషియాకు చెందిన ఓ అమ్మాయిని ఇందులో కథానాయికగా తీసుకున్నారట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తున్నది.