మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన చిత్రం ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకుడు. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. జూలై 10న సినిమా విడుదల కానున్నది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ తిరిగే కథ ఇదని ట్రైలర్ చూస్తే తెలుస్తున్నది. ఆలయంలోని బ్రహ్మపదార్థం కోసం శత్రుమూకలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ కనిపించారు. ‘ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ ఈ భూమ్మీద బతికే హక్కు లేదు’ అనే డైలాగ్.. ట్రైలర్ చివర్లో గరుత్మంతుడి షాట్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇదని, ఇలాంటి సినిమాలో నటించడం నిజంగా తన అదృష్టమని హీరో మహేంద్రన్ అన్నారు. ఒరిస్సాలోని ప్రముఖ ఆలయం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నట్టు దర్శకుడు వైకుంఠ్ బోను తెలిపారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని, మణిశర్మ నేపథ్య సంగీతం, పాటలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయని ఆయన తెలిపారు.