‘మూడేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నా. అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చింది. ఈ సినిమా విజయంపై టీమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పారు సుమంత్. ఆయన కథానాయకుడిగా నటించిన డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్, కలిపు మధు నిర్మిస్తున్నారు. శనివారం దర్శకుడు వెంకీ అట్లూరి అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరి ఉంటుంది వారాహి మాత.
అయితే 150 ఏళ్లుగా అక్కడి రాజకుటుంబానికి చెందినవారు 33 ఏళ్ల వయసులోనే మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, మరణాల వెనకున్న నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో కథానాయకుడికి ఎదురైన సవాళ్ల నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్నో మిరాకిల్స్ జరిగాయని, వారాహి అమ్మవారి ఆశీస్సులతో సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఐశ్వర్యరాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్.