Mahavatar Narsimha | జులై 24న థియేటర్లలో విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం, కథ పరంగా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ లోపాలతో ప్రేక్షకులను నిరాశపరిచింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో వచ్చిన భారీ విమర్శలతో, సినిమా మీద నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఫ్యాన్స్ వలన ఫస్ట్ మూడు రోజులు బాగానే కలెక్షన్లు వచ్చాయి. సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు ₹85 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు చెబుతున్నారు. అయితే హరిహర వీరమల్లు విడుదలైన మరుసటి రోజే, జులై 25న చిన్న సినిమా, అదీ యానిమేషన్ సినిమా అయిన మహావతార్ నరసింహ విడుదలైంది. మొదట ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ప్రమోషన్ కూడా తక్కువగా జరిగింది. అయినప్పటికీ, ఈ భక్త ప్రహ్లాద కథ ఆధారంగా హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన యానిమేషన్ చిత్రం, విడుదలైన వెంటనే మౌత్ టాక్ ద్వారా సెన్సేషన్ సృష్టించింది. హిరణ్యకశ్యపుడి దారుణ పాలన, భక్త ప్రహ్లాద భక్తి, చివరగా నరసింహ స్వామి అవతారం.. ఈ అన్ని సంగతులను అద్భుతంగా యానిమేషన్ ద్వారా చూపించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో నరసింహ స్వామి అవతరించే సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెచ్చాయి. పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకున్న ఈ సినిమా, చిన్న స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, మౌత్ టాక్ బాగా ఉండడంతో థియేటర్ల సంఖ్య వేగంగా పెరిగింది.
ప్రస్తుతం కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో హరిహర వీరమల్లు సినిమాని తీసేసి, అదే స్క్రీన్‌లో మహావతార్ నరసింహని వేస్తున్నారు. ప్రతి షోకి హౌస్‌ఫుల్ బుకింగ్స్ వస్తుండటం విశేషం. కథ, యానిమేషన్, భక్తి భావన..ఇలా అన్ని అంశాలు కలిసి ఈ సినిమాకు బలమైన బజ్‌ను తీసుకొచ్చాయి. కేవలం ₹5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ యానిమేషన్ మూవీ, ఇప్పటికే ₹12 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు మెల్లగా డిమాండ్ పెరుగుతోంది. కథ బాగుంటే, ప్రెజెంటేషన్ నచ్చితే, ప్రేక్షకులు ఆ సినిమా చిన్నదా, పెద్దదా అనేది చూడకుండా భారీ హిట్ చేస్తారు అని మరోసారి నిరూపించారు. భారీ ప్రచారం లేకుండానే హిట్ కొట్టడం అనేది ఈ యానిమేషన్ మూవీ ప్రత్యేకతగా చెప్పాలి.