‘నాలుగేళ్ల క్రితం ఈ సినిమాను మొదలుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, పట్టుదలతో మేకర్స్ మనముందుకు తెచ్చారు. నరసింహస్వామి కటాక్షం వల్లే ఇది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు. ఎప్పుడూ థియేటర్లకు రాని ప్రేక్షకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తున్నారు. హైదరాబాద్ ఏఎంబీలో 200మంది స్వాములు ఈ సినిమా చూడటం ఆనందాన్నిచ్చింది. మా కుటుంబంలో సనాతనధర్మం గురించి పవన్‌కల్యాణ్‌కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఈ సినిమా చూసి, దీని గురించి ఆయన మాట్లాడాలని ఆశిస్తున్నా.’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబాలే ఫిల్మ్స్ పతాకాలపై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ప్రతిష్టాత్మక వెంచర్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'(MCU).
శ్రీమహావిష్ణువు దశావతారాలకు చెందిన శ్రీమద్భాగవతం ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ ద్వారా దృశ్యమానం కానున్నది. ఇందులో తొలి భాగంగా గత నెల 25న విడుదలైన ‘మహావతార్ నరసింహ’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో.. తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన అల్లు అరవింద్ మాట్లాడారు. దీన్ని సినిమాగా కాకుండా, ఓ మహాదర్శనంగా ప్రేక్షకులు భావిస్తున్నారని, ఈ ప్రశంసలన్నీ నరసింహస్వామికే చెందుతాయని, మాతో పాటు అందరికీ డివైన్ ఫీలింగ్ కలిగించిన సినిమా ఇదని, ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన గీతా ఆర్ట్స్ వారికి కృతజ్ఞతలని దర్శకుడు అశ్విన్‌కుమార్ అన్నారు. ఇంకా నిర్మాత శిల్పా ధావన్, తనికెళ్ల భరణి, రచయిత జొన్నవిత్తుల కూడా మాట్లాడారు.