Mahatma Jyotirao Phule | దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890) జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ఒక సినిమా రాబోతుంది. ఫూలే అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. అతడి భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తుంది.
అనంత్ నారాయణ్ మహాదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా.. దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం జ్యోతిబా ఫూలే చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది.