Madhavan | బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ధురంధర్ 2 మూవీ తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ పోషించిన ‘అజయ్ సన్యాల్’ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశం సిక్కు సమాజంలో ఆగ్రహానికి దారితీసింది. సినిమాలో ఒక సన్నివేశంలో మాధవన్ పవిత్రమైన ‘దశమ్ గ్రంథ్’ శ్లోకాలను పఠిస్తూ సిగరెట్ తాగుతున్నట్లు చూపించారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన ఓ సిక్కు నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తమ మతపరమైన భావాలను దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మరింత వేగంగా వ్యాపించడంతో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆ సన్నివేశంలో ధూమపానం చేయలేదని స్పష్టం చేశారు.
సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ సున్నితమైన అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. శ్లోకాలు చదివే ముందు సిగరెట్ ఆర్పేయాలని ఆయన స్పష్టంగా సూచించారు అని తెలిపారు. అదే సమయంలో ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని జాగ్రత్తగా గమనిస్తే తన చేతిలో సిగరెట్ ఉండదని, నోటి నుంచి పొగ కూడా రాదని, ఫ్రేమ్‌లో ఎక్కడా ధూమపానం కనిపించదని వివరించారు. పాత్ర స్వభావం ప్రకారం సీన్ ప్రారంభంలో మాత్రమే సిగరెట్ కనిపిస్తుందని, శ్లోకాలు చదివే సమయంలో దానిని పూర్తిగా దూరం పెట్టామని క్లారిటీ ఇచ్చారు.
ఇంకా, సిక్కు సమాజంపై తనకు ఎంతో గౌరవం ఉందని మాధవన్ తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు గోల్డెన్ టెంపుల్ ను సందర్శించడం తనకు అలవాటు అని చెప్పారు. తమ చిత్ర బృందానికి ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ, ఎవరికైనా అనుకోకుండా అభ్యంతరం కలిగితే క్షమించాలని వినమ్రంగా కోరారు. మాధవన్ ఇచ్చిన వివరణ, క్షమాపణల నేపథ్యంలో ఈ వివాదం త్వరలోనే సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.