శివకార్తీకేయన్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తా. ‘మదరాసి’ విషయంలో అదే భావనతో ఉన్నా. ఇదొక డిఫరెంట్ కథ. దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ఈ సినిమా కథ ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. విలన్ ఈ సినిమాలో హీరోని మదరాసి అని పిలుస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం’ అన్నారు. తమిళనాడు నేపథ్యంలో కథ నడిచినా సినిమా కంటెంట్ అందరికి కనెక్ట్ అవుతుందని, మనదేశంలో కొత్తగా ఉత్పన్నమైన ఓ సమస్య ఆధారంగా కథ రాసుకున్నానని, అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇదని మురుగదాస్ పేర్కొన్నారు.
‘శివకార్తీకేయన్‌కు మంచి మాస్ ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో ఈ కథ చెప్పాలనుకున్నా. ఇక ఈ సినిమాలో కథానాయిక రుక్మిణి వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని మురుగదాస్ చెప్పారు. తాను సినిమాలకు ఐదేళ్లు గ్యాప్ తీసుకోలేదని, ఆ సమయంలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని, అది కార్యరూపం దాల్చలేదని, దానివల్లే సమయం అంతా వృథా అయిందని ఆయన వివరించారు. ప్రస్తుతం తన వద్ద చాలా కథలున్నాయని, పైనలైజ్ అయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తానని మురుగదాస్ తెలిపారు.